మరో మూడు నెలల్లో పాకాల - ధర్మవరం మధ్య విద్యుత్ రైళ్లు నడుస్తాయని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ వెంకటరమణా రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పాకాల-కలికిరి మధ్య జరిగిన విద్యుదీకరణ పనులను పరిశీలించారు. అలాగే విద్యుత్ ట్రైన్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పీలేరులో డిఆర్ఎం విలేకరులతో మాట్లాడుతూ, విద్యుత్ రైళ్లు నడపటానికి చేపట్టిన విద్యుదీకరణ పనులు ప్రస్తుతం పాకాల-కలికిరి మధ్య పూర్తి కావచ్చాయని అన్నారు. కలికిరి-తుమ్మలగుంట మధ్య మిగిలిన పనులు కూడా మరో మూడు నెలల్లోగా పూర్తి కానున్నాయని చెప్పారు. ఆ తరువాత విద్యుత్ రైళ్ళను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పీలేరులో నాగర్ కోయిల్- ముంబాయి, కాచిగూడ-మదురై రైళ్ల స్టార్టింగ్ కు అనుమతించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ ఆ విషయాన్ని రైల్వే బోర్డుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. దాంతో పాటు మరో రెగ్యులర్ రైలును కూడా నడవడానికి ప్రతిపాదించామని పేర్కొన్నారు. అనుమతులు వచ్చాక ఆ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ బృందం ముందుగా పీలేరు-చిత్తూరు, పీలేరు-మదనపల్లి మార్గాల్లోని రైల్వే గేట్ల వద్ద, పీలేరు గార్గేయ నది వంతెనపై జరిగిన విద్యుదీకరణ పనులను పరిశీలించింది. ఈ తనిఖీల్లో బెంగళూరు రైల్వే సేఫ్టీ కమిషనర్ అభయ్ కుమార్ రాయ్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరు సోమేష్ కుమార్, సిపిపి నాగేంద్ర ప్రసాద్, డిప్యూటీ సిఈ వీరయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.