పర్యాటక కేంద్రమైన అరకు లోయలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. మునుపెన్నడు లేని విధంగా గత నెల రోజులుగా పర్యాటకులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని అందరు భావించినప్పటికీ, ఇప్పటికి పర్యటకుల సంఖ్య ఏమాత్రం కూడా తగ్గుముఖం పట్టలేదు. ఆదివారం కూడా పర్యాటకులు తరలివచ్చారు.దీంతో అరకు ప్రాంతంలోని పర్యాటక సందర్శిత ప్రాంతాలు కిటకిట లడాయి. మరమ్మత్తుల దృష్ట్యా పద్మావతి ఉద్యాన కేంద్రం ఈనెల మూడు నుంచి 11 వరకు మూసి వేస్తున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో ప్రకటించినప్పటికీ, వందల సంఖ్యలో ప్రతిరోజు తరలివచ్చి నిరాశతో వెను తిరుగుతున్నారు. దీంతో అరకులో గిరిజన సంస్కతిక మ్యూజియం, కాపీ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీ కిటకిటలాడుతున్నాయి. పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి రావడంతో గత నెల రోజుల నుంచి అరకు విశాఖ ఘాట్రోడ్లో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పెరుగుతున్న పర్యాటకులతో ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ దృష్ట్యా స్థానిక పోలీసులకు సవాలుగా మారింది. సిఐ, ఎస్సైల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పర్యాటకులు, ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. పర్యాటకుల సంఖ్య పెరగడం, ట్రాఫిక్ జాం ఘాట్రోడ్లో ఏర్పడుతున్న దృష్ట్యా ఇప్పటికే కాపీ తోటలోని ఉడెన్ బ్రిడ్జి మూసివేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి సెలవులు సమీపిస్తుండటంతో ఇంకా పర్యటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. డుంబ్రిగుడ: మండలంలో పర్యాటక ప్రదేశాలైన చాపరాయి జలపాతంలో సుమారు గత ఐదు, ఆరు వారాల బట్టి పర్యాటకుల తాకిడి తగ్గడం లేదు. అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తుండడంతో పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.