ఒడిశాలో దారుణం జరిగింది. కడుపు నొప్పి అంటూ వచ్చిన ఓ రోగిని కర్రతో చితకబాది, లేని నొప్పిని కలిగించాడు ప్రభుత్వ వైద్యుడు. ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో, ముఖేష్ నాయక్ అనే వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో స్థానిక ధర్మఘర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి వెళ్లాడు ముఖేష్. అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు. దీంతో అక్కడ ఉన్న ఇతర సిబ్బందిని వైద్యుడి గురించి అడగ్గా, వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. చేసేదేం లేక, నర్సులతో ఇంజెక్షన్ చేయించుకున్నాడు ముఖేష్. అయినా కడుపునొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో డాక్టర్లు ఎందుకు లేరని ముఖేష్ మరోసారి అడిగాడు. ఇలా అడిగిన కొద్దిసేపటికి నేరుగా ముఖేష్ దగ్గరకు వచ్చాడు డాక్టర్ సైలేష్ కుమార్. రావడం రావడమే ఒక కర్ర అందుకొని అతడిపై దాడికి దిగాడు. పేషెంట్ అనే కనికరం కూడా లేకుండా పిడిగుద్దులు కురిపించాడు. డాక్టర్ దాడిని అక్కడున్నవారు సెల్‌ఫోన్లలో రికార్డ్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది. ఆ వీడియోలో డాక్టర్ సైలేష్ కుమార్, వైద్యుడిలా కాకుండా ఓ బాక్సర్‌లా కనిపించాడు. ఈ ఫైటింగ్ వీడియోను చూసి చలించిన కొందరు స్థానికులు, రోడ్డుపై బైఠాయించారు. దాడి చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.