సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే కొత్త ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ అబ్జాద్ ప్రకటించారు. 1.65 ట్రిలియన్ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.కొన్నేళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల సిరియా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని అబ్జాద్ పేర్కొన్నారు. అయితే తమ నూతన ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తామని అరబ్ దేశాలు హామీ ఇచ్చాయని తెలిపారు. సిరియాకు చెందిన విదేశాల్లోని 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విడిపించుకొనే దిశగానూ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.