by Suryaa Desk | Fri, Jan 17, 2025, 03:48 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ29' వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ నెల ప్రారంభంలో రహస్యంగా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అయితే, ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ మూవీ కోసం మహేశ్ బాబు పూర్తిగా మేకోవర్ కూడా అయ్యారు. లాంగ్ హెయిర్‌స్టయిల్, గుబురు గడ్డంతో మహేశ్ ఇటీవల పలు వేడుకల్లో కనిపించారు.ఇదిలాఉంటే... 'ఎస్ఎస్ఎంబీ29'లో మహేశ్ పక్కన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె నిక్ జోనాస్ ను పెళ్లాడిన తర్వాత బాలీవుడ్ చిత్రాలకు పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం హాలీవుడ్ మూవీస్ చేస్తున్నారామె. అయితే, జక్కన్న తాను మహేశ్‌తో చేస్తున్న ప్రాజెక్టు కోసం ప్రియాంకను కథానాయికగా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రియాంక ఈరోజు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దాంతో నెటిజన్లు 'ఎస్ఎస్ఎంబీ29' కోసమే వచ్చారంటూ పోస్టు పెడుతున్నారు. దీనికి ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్టు ఊతం ఇస్తోంది. ఇందులో ఓ వీడియోను ప్రియాంక చోప్రా పంచుకున్నారు. వీడియోలో టొరంటో నుంచి దుబాయికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు పయనమైనట్లు తన జర్నీ వివరాలను ఆమె తెలియజేశారు. దీనికి 'ఆర్ఆర్ఆర్' రోరింగ్ బీజీఎంను ప్రియాంక యాడ్ చేశారు. దాంతో రాజమౌళి-మహేశ్ ప్రాజెక్టుపై ఆమె ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.కాగా, ఈ సినిమా ఓ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని రచయిత విజేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కాబోతున్నారని సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జక్కన్న అన్ని సినిమాలకు బాణీలు అందించిన ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారు.
Latest News