by Suryaa Desk | Fri, Jan 17, 2025, 03:50 PM
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగ సృష్టించిన బీభత్సం అందరికీ తెలిసిందే. గురువారం నాడు జరిగిన ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ని వెంటనే లీలావతి హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసిన తరువాత ప్రాణాపాయం ఏమీ లేదని ప్రకటించారు. ఆరు చోట్ల కత్తి పోట్లు, రెండు చోట్ల లోతుగా గాయాలు అయ్యాయని, వెన్నుముక పక్కన గాయమైందని వైద్యులు తెలిపారు. అయితే ఈ దాడి ఘటన మీద మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ముంబై క్రైం బ్రాంచ్ రంగంలోకి దిగింది. ముప్పై గంటల్లోనే ఆ నిందితుడ్ని పట్టుకుని అరెస్ట్ చేసింది.సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి దుండగుడు దాడి చేయడంపై అక్కడి ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విరుచుకపడ్డాయి. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదంటూ కామెంట్లు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకుంది. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రైంచ్ బృందాలుగా విడిపోయి కేసుని ఛేదించారు. ముప్పై గంటల్లోనే ఈ కేసుని క్లోస్ చేశారు.
ఫైర్ ఎగ్జిట్ గేటు నుంచి దొరికిన కెమెరా విజువల్స్ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. ఇక అతడ్ని అరెస్ట్ చేసి పోలీసులు తమ స్టైల్లో విచారిస్తున్నారు. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మరి ఆ నిందితుడు నోరు తెరిచి ఏం చెబుతాడా? అని అంతా ఎదురుచూస్తున్నారు. అసలు సైఫ్ ఇంట్లోకి ఎందుకు దూరాడు? దీని వెనుక ఎవరున్నారు? ఇది ఎవరైనా ప్లాన్ చేశారా? అంటూ అంతా చర్చించుకుంటున్నారు.