by Suryaa Desk | Fri, Dec 20, 2024, 09:20 PM
పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో గురువారం హార్ట్ బీట్ ఫౌండేషన్ ఫర్ ది విజువల్లీ ఇంపైర్డ్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని అవయవాలు సరిగా ఉండి కూడా జీవితంలో ఏమీ సాధించలేని వారికన్నా, చూపు లేకున్నా ఆత్మవిశ్వాసంతో తమ కళను సాకారం చేసుకునే దిశగా సాధన చేసి తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడడం, మిమిక్రీ చేయడం, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విషయాలు చెప్పడం నిజంగా అభినందనీయం అన్నారు.
స్వయంగా అంధుడైన నిర్వాహకులు కేవలం తన కోసమే ఆలోచించకుండా , ఇతరులపై ఆధారపడకుండా ఎంతో మంది అంధులకు సహాయం చేస్తూ వారి జీవితాలకు వెలుగును ఇచ్చే దిశగా కృషి చేస్తున్న హార్ట్ బీట్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి సంస్థకు చేయూతగా మన పాఠశాల విద్యార్థులు కూడా తమకు తోచినంతగా విరాళాలు సేకరించి వారికి అందించాల్సిందిగా విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విభావరిలో గాయనీ గాయకులు పాడిన పలు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలంతా చప్పట్లతో గాయకులను ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం, ఫౌండేషన్ నిర్వాహకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.