by Suryaa Desk | Sat, Dec 21, 2024, 01:17 PM
కేటీఆర్ పై ఏసీబీ కేసు సంచలనంగా మారింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ ఖాయం అనే ప్రచారం జరిగింది. ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ను ఏ-1 గా పేర్కొన్నారు. దీంతో, కేటీఆర్ హైకోర్టు లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. సుదీర్ఘ వాదనల తరువాత కేటీఆర్ ను ఈ నెల 30వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఈ రోజు అసెంబ్లీకి హాజరైన కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ వ్యాఖ్యలతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కేటీఆర్ కు తాత్కాలికంగా రిలీఫ్ దక్కింది. అయితే, ఈ కేసులో విచారణ కొనసాగించేందుకు ఏసీబీకీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఎవరినైనా విచారణ చేయవచ్చని పేర్కొంది. దీంతో, ఈ కేసు పైన ఫిర్యాదు చేసిన అధికారి దానకిశోర్ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ తదుపరి విచారణకు సిద్దమైంది. ఇక, కోర్టు ఇచ్చిన రిలీఫ్ తో కేటీఆర్ ఈ రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. రైతు భరోసా పైన చర్చల్లో పాల్గొన్నారు. సంక్రాంతికి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో ప్రతిపక్షం నుంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. మంత్రుల కౌంటర్ ఇదే అంశం పైన మాట్లాడిన కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిన మేలు గురించి వివరించారు. రుణమాఫీ గురించి ప్రస్తావన చేసారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. చెల్లించాల్సిన రైతు రుణమాఫీ అంశంలో పలు సందర్భాల్లో చెప్పిన మొత్తం రుణ విలువ గురించి వివరించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి మంత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి..మోసం చేసారని ఆరోపించారు. తాము రెండు లక్షల వరకు ప్రతీ రైతుకు రుణమాఫీ అమలు చేసామని చెప్పుకొచ్చారు. సంక్రాంతికి నిధులు శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. 24 గంటల విద్యుత్‌పై ఇద్దరి మధ్య తీవ్ర చర్చ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వలేదని.. తాను లాగ్ బుక్కుల ఆధారంగా నిరూపిస్తానని చెప్పారు. తాను నల్గొండ జిల్లాలో పరిశీలన చేసిన సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాలను వివరిం చారు. దీంతో, కేటీఆర్ విభేదించారు. తమ హయాంలో24 గంటల విద్యుత్ అమలు చేసామని చెప్పుకొచ్చారు. ఇక, రైతు భరోసా అమలు సంక్రాంతికి చేస్తామని చెప్పిన ప్రభుత్వం .. ప్రతిపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకొని.. తమ విధానం ప్రకటించేందుకు సిద్దమైంది.