by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:26 PM
రోల్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇటీవల శంషాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ రోల్ బాల్ స్కేటింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు చేవెళ్ల మండల కేంద్రంలోని వివేకానంద విద్యాసంస్థలో ఆరవ తరగతి చదువుతున్న హుదా ఫాతిమా ఎంపికైంది. జనవరిలో అస్సాంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ నుంచి హుదా ఫాతిమా పాల్గొననుంది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన హుదా ఫాతిమా తన కోచ్ భాస్కర్, స్థానిక నాయకులు, తల్లిదండ్రులతో కలిసి ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థిని హుదా ఫాతిమాను, కొచ్ భాస్కర్ ను అభినందించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. అంతకుముందు పాఠశాలలో వివేకానంద విద్యాసంస్థ చైర్మన్ కొరదాల నరేష్ ఫాతిమాను ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలలో విద్యార్థులను ప్రోత్సాహించడమే తమ విద్యాసంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. తమ విద్యాసంస్థ నుంచి దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారు చేస్తామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ వైస్ ఎంపీపీ కర్నే శివప్రసాద్, ఊరెళ్ళ మాజీ సర్పంచ్ జహంగీర్, పాఠశాల మేనేజర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.