by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:31 PM
దేశ వ్యాప్తంగా బజరంగదళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శౌర్య య్రాత బుధవారం జోగిపేట పట్టణంలో నిర్వహించగా జిల్లా పోలీసు యంత్రాంగం భారీగా పోలీసులను మోహరించింది. శౌర్యయాత్రలో భాగంగా నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథిగా బజరంగ్ దళ్ అఖిలభారతీయ అధ్యక్షుడు సంయోజక్ నీరజ్ దోనేరియా హజరుకావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. జిల్లా నలుమూల నుంచి వేల సంఖ్యలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు తరలివస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంగారెడ్డి డీఎస్‌పీ సత్తెయ్య గౌడ్ నేతృత్వంలో స్పెషల్ పోలీసులతో పాటు డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల నుంచి ఎస్‌ఐ, పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.
వేలాది మందితో భారీ ర్యాలీ
ఈ ర్యాలీలో జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, పటాన్‌చెరువు పాంతాల నుంచి వేల సంఖ్యలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. శౌర్యాయాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బజరంగ్ దళ్ అఖిలభారతీయ అధ్యక్షుడు సంయోజక్ నీరజ్ దోనేరియా ప్రారంభించారు. స్థానిక వాసవీకళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన ర్యాలీ క్లాక్‌టవర్, గౌని చౌరస్తా, బసవేశ్వర విగ్రహం, మార్కెట్ గంజ్, బస్టాండ్ తహసీల్దారు కార్యాలయం మీదుగా వెళుతూ అంబేద్కర్ విగ్రహానికి సంయోజక్ నీరజ్ దోనేరియా పూలమాల వేసి ముందుకు కదిలారు. ఈ ర్యాలీ తిరిగి వాసవీకళ్యాణ మండపానికి చేరుకుంది. ర్యాలీలో పాల్గొన్న యువకులు కాషాయపు రంగు టీషర్టులు, కండువాలు ధరించారు. బజరంగ్ దళ్ కార్యకర్తల నినాదాలతో పట్టణమంతా దద్దరల్లిపోయింది. కార్యకర్తలు చేతిలో హనుమంతుడి పతాకాలతో ముందుకు నడిచారు. వాసవీకళ్యాణ మండపంలో కార్యకర్తలతో త్రిశూల్ దీక్ష ప్రతిజ్ఞను జాతీయ అధ్యక్షుడు సంయోజక్ నీరజ్ దోనేరియా చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బజరంగ్‌దళ్ నాయకుడు సుభాష్ చందర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.