|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 12:15 PM

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా హామీల అమలు ఊసేలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తులం బంగారం ఇవ్వబోమని మండలి సాక్షిగా చెప్పారని, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పని చేస్తున్నారని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారంటూ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నల వర్షం కురిపించారు.మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. అన్ని వర్గాలను వంచించినట్టు విద్యార్థులను మోసం చేశారని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ సభలో తాము ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.దేశంలో అనేక పార్టీలు హామీలు ఇస్తాయి.. కానీ చెప్పని హామీలు సైతం అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ అని.. ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని.. మళ్లీ సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతుందని ఆరోపించారు. లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు.. హామీలు విస్మరించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రియాంక గాంధీకి విద్యార్థులు పోస్ట్ కార్డులు రాస్తున్నారని.. ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.