![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 05:07 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ( మంగళవారం) విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ కేటీఆర్‌పై మహాదేవ్‌పూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. బ్యారేజీపై డ్రోన్ ఎగురవేయడం వల్ల మేడిగడ్డ బ్యారేజీ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని నిషిద్ధ ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నోటిఫై చేసిందని కేటీఆర్ తరఫు న్యాయవాది అన్నారు. నిషిద్ధ ప్రాంతంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వెలువడలేదని కేటీఆర్ న్యాయవాది తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం కేవలం జరిమానాతో సరిపెట్టవచ్చని కేటీఆర్ న్యాయవాది చెప్పారు. రాజకీయ కక్ష్యల కారణంగానే పోలీసులు మరోసారి సెక్షన్లను మార్చారని కేటీఆర్ న్యాయవాది వివరించారు. పోలీసులు మార్చిన సెక్షన్లు ఈ కేసుకు సరిపోవని కేటీఆర్ న్యాయవాది చెప్పారు. సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ ఒకే విధంగా ఉన్నాయని కేటీఆర్ న్యాయవాది తెలిపారు. అయితే హైకోర్టు ఈ తీర్పును రిజర్వు చేసింది.