|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 06:03 PM
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్డులు జారీ చేయకపోవటంతో.. కుటుంబాలు వేరు పడిన వారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవ కేంద్రాల ద్వారా అర్హుల నుంచి అఫ్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా కార్డులను మంజూరు చేశారు. తాజాగా.. కొత్త రేషన్ కార్డులపై బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు.
రాష్ట్రంలో త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. పారదర్శకంగా అర్హులందరికీ కార్డులు జారీ చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఉగాది నుంచి రేషన్ కార్డుల రేషన్ పంపిణీ మొదలు కాబోతుందని చెప్పారు హుస్నాబాద్ ఐవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం నల్గొండలో సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబ సభ్యుడికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.
ఇక వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎండాకాలంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరి కోతలు జరుగుతున్నందున, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు చెప్పారు.ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బందులు పెట్టిందని.. అందుకే తాము అధికారంలోకి రాగానే కార్డులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.