![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 06:07 PM
తెలంగాణలో సంచలనంగా మారిన ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. సభలో ఈ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ హోంశాఖ, శాంతి భద్రత, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం 2021లో ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించిందని గుర్తుచేశారు. కానీ.. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ నిషేధం అమలు కావటం లేదన్నారు. అందుకే.. ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు.
గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆన్‌లైన్ రమ్మీ వంటి బెట్టింగ్ గేమ్‌లను అరికట్టేందుకు స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గత కొద్ది రోజులుగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించినట్టు రేవంత్ రెడ్డి వివరించారు. అయితే.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే వారిపై కేసులు పెట్టటం, విచారించటం వలన సమస్య తీరదని అభిప్రాయపడ్డారు. ఈ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలంటే చాలా మందిని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని.. ఇందుకు ప్రభుత్వానికి అన్ని అధికారాలు కావాలన్నారు.
అందుకోసమే.. ఈ బెట్టింగ్ యాప్‌లపై విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారికి విధించే శిక్షను పెంచేందుకు వచ్చే సమావేశాల్లో సవరణ బిల్లును సభలో ప్రవేశ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.