![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 08:49 PM
నేను తెలుగు గడ్డ మీద పుట్టాను. నా మాతృభాష తెలుగు. అందుకే నేను హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడలేను. నేను తెలుగు వ్యక్తిని" అని తెలంగాణ మంత్రి సీతక్క శాసనసభలో అన్నారు. మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు హిందీ, ఇంగ్లిష్ రాదని చెబుతున్నారని, కానీ తాను తెలుగు రాష్ట్రంలో ఎక్కడో గూడెంలో పుట్టానని ఆమె అన్నారు.పంచాయతీరాజ్ సవరణ బిల్లును తెలంగాణ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఈ బిల్లుపై చాలామంది సభ్యులు విలువైన సూచనలు చేశారని, ఈ బిల్లులో లేని అంశాలను సభ్యులు ప్రస్తావించారని తెలిపారు. సభ్యులు ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామని ఆమె వెల్లడించారు.రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్ ఏరియాలో గుర్తించారని, ఆ చట్టాన్ని 1/70గా పిలుస్తారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు, అభివృద్ధి జరిగేందుకు 1/70 చట్టం కృషి చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఏజెన్సీ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ అయితే అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారని ఆమె అన్నారు.ములుగును మున్సిపాలిటీగా చేసుకుంటున్నామని సీతక్క అన్నారు. ప్రజల అభిప్రాయం, కలెక్టర్లు పంపిన ప్రతిపాదనల ఆధారంగా మున్సిపాలిటీలుగా నవీకరిస్తున్నట్లు తెలిపారు. కొన్ని గ్రామాలు ఒక మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాయని, రెవెన్యూ పరంగా మరో మండలంలో ఉంటున్నాయని, ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మనం ఆమోదించుకున్నామని, కేంద్రం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని అన్నారు. అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు