|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 05:51 PM
సోమవారం తెల్లారుజామున భారీ విషాద వార్తతో తెలంగాణ నిద్రలేచింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పరిధిలో మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. పెను విషాదాన్ని నింపింది. మితిమీరిన వేగంతో వచ్చి అదుపు తప్పిన టిప్పర్.. బస్సును ఢీకొట్టి దానిపైనే బోల్తాపడింది. ఇక ఆ టిప్పర్‌లో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై పడటంతో వారు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బస్సు కుడివైపు మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 19 మంది ప్రాణాలు విడిచారు. మరో 25 మంది గాయలతో ఆస్పత్రిలో చేరారు.
ఇక ఈ బస్సు ప్రమాద ఘటనను తెలంగాణ మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని హెచ్ఆర్సీ ఆదేశించింది. ఇందుకు డిసెంబర్ 15వ తేదీ లోపు గడువు విధించింది. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి.. తెలంగాణ రవాణా శాఖతోపాటు.. హోం శాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులు రిపోర్టు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారిని.. రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీని నివేదిక పంపాలని హెచ్ఆర్సీ ఆదేశించింది.
సోమవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో మీర్జాగూడ వద్ద చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, బస్ డ్రైవర్ సహా 19 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న తాండూరు ఆర్టీసీ బస్సును.. కంకర టిప్పర్ అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టీఎస్ 34 టీఏ 6354 ఆర్టీసీ బస్సు.. తాండూరు నుంచి తెల్లవారుజామున 4:30 గంటలకు 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది.
మధ్యలో వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో మరింత మంది ఎక్కారు. మొత్తం 72 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ బస్సు.. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్దకు రాగానే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై చేవెళ్ల నుంచి వికారాబాద్‌కు కంకర లోడ్‌తో వెళ్తున్న టీజీ 06 టీ 3879 నంబర్ గల టిప్పర్.. ఎదురుగా అతి వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అనంతరం ఆ టిప్పర్ పూర్తిగా బస్సుపైనే ఒరిగిపోయింది.
ఈ క్రమంలోనే ఆ టిప్పర్‌లో ఉన్న కంకర మొత్తం బస్సులోకి జారింది. దీంతో ఆర్టీసీ బస్సు కుడివైపున 8 వరుసల సీట్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఆ సీట్లలో కూర్చున్న కొందరు ప్రయాణికులు బలమైన గాయాలతో మృతి చెందారు. మరికొందరు ఆ కంకరలో కూరుకుపోయి ఊపిరాడక విలవిల్లాడుతూ చనిపోయారు. ఇక ఘటనలో బస్సు డ్రైవర్‌తోపాటు టిప్పర్ డ్రైవర్ కూడా దుర్మరణం చెందారు.
వీరితోపాటు మరో 17 మంది ప్రయాణికులు ప్రాణాలు వదిలారు. మృతుల్లో 12 మంది మహిళలు ఉండగా.. ఆరుగురు పురుషులు, ఒక 10 నెలల చిన్నారి ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. మరో 25 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.