|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 10:17 PM
తెలంగాణ పై చలి పంజా విసురుతోంది. చలి గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇక నగరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. ఈక్రమంలో తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. శుక్ర, శని వారాల్లో చలి తీవ్రత ఇలానే కొనసాగుతుందని ప్రకటించింది. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ప్రకటించింది.
రాష్ట్రంలో చలిగాలుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతండటంతో జనాలు ఎముకలు కొరికే చలితో గజ గజ వణికిపోతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.4 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలానే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-యూలో 8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇప్పటికే చలి గాలుల తీవ్రత పెరిగి ఇబ్బంది పడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది. ఆ తర్వాత రెండు రోజుల్లో (నవంబర్ 24 నాటికి) అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మొంథా తుఫాన్ తీరం దాటిన తర్వాత వర్షాలకు పూర్తిగా బ్రేక్ పడింది.. ఇక ఇప్పట్లో వానలు లేవు అనుకుంటున్న వేళ మరో తుఫాన్ ముంచుకొస్తుందనే హెచ్చరికలు రైతాంగాన్ని భయపెడుతున్నాయి. వరి కోతలు, పంట చేతికి వచ్చే సమయం కావడంతో.. వర్షాలు కురిస్తే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేడు, రేపు (శుక్ర, శనివారాల్లో) మాత్రం వర్షాలు కురిసేందుకు అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది.. ఆదివారం తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంది.
రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత పెరగడంతో జనాలు జాగ్రత్తగా ఉండాలని.. మరీ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. చలి గాలుల వల్ల రాష్ట్రంలో జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రులు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.