|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:15 PM
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ముగిసింది. లక్షలాది మంది భక్తుల రాకతో నెల రోజులుగా కిక్కిరిసిపోయిన మేడారం పరిసరాలు.. జాతర ముగిసిన అనంతరం భారీగా పేరుకుపోయిన వ్యర్థాలతో నిండిపోయాయి. భక్తులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నప్పటికీ.. వారు వదిలి వెళ్లిన టన్నుల కొద్దీ చెత్తను శుభ్రం చేయడం ఇప్పుడు అధికారులకు, పారిశుధ్య సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది.
మేడారంతో పాటు భక్తులు బస చేసిన కొంగల గట్టు, గుడ్డేలుగుల గుట్ట, కన్నెపల్లి, నార్లాపూర్ వంటి పలు ప్రాంతాల్లో వేలాది టన్నుల చెత్త పోగయ్యింది. గత 2024 జాతర గణాంకాల ప్రకారం సుమారు 3 వేల టన్నుల చెత్తను గుర్తించగా.. ఈసారి కూడా అదే స్థాయిలో వ్యర్థాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి జంతు వ్యర్థాలు, మృతి చెందిన కోళ్ల వ్యర్థాల వల్ల దుర్గంధం వెదజల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో 6 వేల మంది పారిశుధ్య కార్మికులు యుద్ధప్రతిపాదికన రంగంలోకి దింపి క్లీనింగ్ చేపట్టారు.
అయితే ఈ పని చేసేందుకు వచ్చిన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బాధ్యతారహిత్యంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ పని చేస్తుంటే.. వాంతులు అవుతున్నాయని.. తోళ్లు, మేకకాళ్లు, తలకాయలు, కోళ్లు గుట్టలు గుట్టలుగా వేశారని వాపోతున్నారు. రోడ్లు, ప్లాస్టిక్ క్లీనింగ్ అని చెప్పి.. ఇలాంటి వ్యర్థాలు ఎత్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవి చూస్తుంటేనే వాంతులు వస్తున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో తామెప్పుడూ పని చేయలేదని అంటున్నారు. ఇంత గలీజు పని ఎప్పుడూ చేయలేదని చెబుతున్నారు. సమ్మక్క దయతోనే పని చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇక వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్ ముప్పు జాతరలో పోగైన వ్యర్థాల్లో సుమారు 48 శాతం వరకు ప్లాస్టిక్, గాజు వంటి భూమిలో కలిసిపోని వస్తువులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో సుమారు 100 టన్నులకు పైగా కేవలం ఖాళీ బాటిళ్ల వ్యర్థాలే ఉన్నట్లు గుర్తించారు. ఇందులో సగం బాటిళ్లు రీసైక్లింగ్‌కు అవకాశం ఉండగా.. మిగిలిన సగం జాతర ప్రాంగణంలోనే పగిలిపోయి ప్రమాదకరంగా మారాయి. మరోవైపు.. సుమారు 52 శాతం వ్యర్థాలలో బియ్యం, బెల్లం, కొబ్బరి, ఇతర ఆహార పదార్థాలు ఉండగా ఇవి భూమిలో తేలికగా కలిసిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పారిశుధ్య సిబ్బంది ఈ వ్యర్థాలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.