రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' అమలు చేయాలని నిర్ణయించారు. రేపు (జనవరి 4) విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేశ్ లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 398 పాఠశాలలు అనుసంధానమై ఉండగా, అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చుచేయనున్నారు.