బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తోబుట్టువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పర్చూరు రామాలయం వీధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాధ ఘటనలో అక్కాచెల్లెల్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అక్కా చెల్లెల్లు దాసరి నాగమణి (34), మాధవి లత (30)కు మంటలు అంటుకున్నారు. ఆ తరువాత క్షణాల్లోనే ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీ రాజ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అగ్నిప్రమాదంలో అక్కా చెల్లెల్లు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన తల్లి లక్ష్మీరాజ్యంకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఆమె పరిస్థితిపై వైద్యులు సమాచారం ఇవ్వాల్సి ఉంది.