ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం జనవరి 17న భేటీ కానుంది. జనవరి 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ఏపీప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. వెలగపూడి సచివాలయం మొదటి అంతస్తులో ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ప్రారంభమవుతుందని విజయానంద్ ఉత్తర్వులో పేర్కొన్నారు. కేబినెట్ భేటీ నేపథ్యంలో తమ ప్రతిపాదనలను జనవరి 16వ తేదీలోగా పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు జనవరి 17న జరిగే ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా గీత కార్మికుల కులాలకు మద్యం షాపుల కేటాయింపు, మద్యం ధరలపై చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే ఇతర కీలకాంశాలపైనా చర్చించనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 18న చంద్రబాబు దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు . దావోస్‌లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దావోస్ పర్యటన గురించి కూడా మంత్రివర్గ సమావేశంలే చర్చించనున్నట్లు సమాచారం. జనవరి రెండో తేదీ ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 14 కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఏపీ ఎన్నికల సమయంలో గీత కార్మిక కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. 10 శాతం మద్యం దుకాణాలను గీత కార్మిక కులాలకు కేటాయిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవలే అధికారులను కూడా చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని లిక్కర్ షాపుల్లో 10 శాతం అంటే 340 షాపులను గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, గౌండ్ల, గామల్ల, శ్రీశయన, కలాలీ, శెగిడి, యాత, సొండి వంటి గీత కార్మిక కులాలకు కేటాయించాలని ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.