దేశంలో హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళనలకు వ్యక్తమవుతున్నాయి. చైనా, జపాన్ దేశాలలో ఈ వైరస్ కేసులు భారీగా నమోదవుతూ ఉండటం.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇలాంటి తరుణంలో మన దేశంలోనూ HMPV వైరస్ కేసులు నమోదు కావటం ప్రజలకు ఉలిక్కిపడేలా చేసింది. మనదేశంలో ఇప్పటి వరకూ నాలుగు కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో 2, గుజరాత్ అహ్మదాబాద్‌లో ఒకటి, పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో ఒక కేసు బయటపడ్డాయి. చెన్నైలోనూ రెండు కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో కొత్త వైరస్ కేసులు నమోదైన క్రమంలో.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ఏపీ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి గురించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎలాంటి కేసులు లేవని.. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. పొరుగున ఉన్న కర్ణాటకలో కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఆస్పత్రులలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇది సాధారణ ఫ్లూలాంటిదేనన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన నేపథ్యంలో ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని., టెస్టులు, ఔషధాలను కూడా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
మరోవైపు హ్యూమన్ మెటానిమోవైరస్ అనేది కొత్తది కాదని.. గతంలో ఉన్న వైరస్సేనని అధికారులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో 12శాతం వరకు ఇదే ఉంటోందని చెప్తున్నారు. ఈ వైరస్‌ను 2001లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా చెప్తోంది. ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఇది కూడా కనిపిస్తుందని.. ఐదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు, తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వాళ్లలో ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చాలా వరకూ తగ్గిపోతుందని.. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం అవుతుందని తెలిపారు.