ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు సేవలు అందిస్తున్నాయి. అయితే కొత్తగా మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మించి.. విమానాశ్రయాల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. నూతన విమానాశ్రయాల నిర్మాణం ద్వారా అనుసంధానం పెంచి.. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలని ఆయన ఆలోచన. ఈ దిశగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు పని ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండటం కూడా కలిసివస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్టు అధికారులతో భేటీ అయిన చంద్రబాబు.. ఏడు ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోనూ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉమ్మడి జిల్లావాసుల ఏళ్లనాటి కల సాకారమయ్యేలా అడుగులు పడుతున్నాయి. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. ఏళ్ల నుంచి ఉంది. తాడేపల్లిగూడెంలో బ్రిటీష్ కాలంలోనే రన్‌వే నిర్మించారు. 653.48 ఎకరాలను సేకరించి.. 1.90 కిలోమీటర్ల పొడవున రన్‌వేను అప్పట్లోనే నిర్మించారు. అలాగే సుమారు 20 ఏళ్ల కిందట కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. కానీ వివిధ కారణాలతో అవి పట్టాలెక్కలేదు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని.. భూముల పరిశీలన కూడా జరిగింది. కేంద్ర బృందం పరిశీలన కూడా పూర్తైంది. అయితే ఆ తర్వాత ఆ భూములను వేరే వాటికి కేటాయించారు. దీంతో ఉమ్మడి జిల్లా వాసుల కల సాకారం దిశగా అడుగులు ముందుకు పడలేదు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో తాడేపల్లిగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు మళ్లీ తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తాడేపల్లిగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూముల పరిశీలన జరుగుతోంది. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలాల్లో 1,123 ఎకరాల అటవీ భూములను గుర్తించారు. అయితే ఈ భూములను ఎయిర్ పోర్టు నిర్మాణానికి అప్పగించాలంటే ముందుగా కేంద్ర అటవీ శాఖ డీ నోటిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ కావటంతో ఇందుకు రెండింతల భూమిని.. అంటే 2250 ఎకరాల వరకూ కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.