మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం విధిస్తూ మధ్య ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్‌పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్‌కంటక్, మాండ్లా, ముల్తాయ్, కుండల్‌పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా ఉన్నాయి. జ్యోతిర్లింగమైన ఉజ్జయినిలో కూడా మద్య నిషేధం ఉంటుందా అన్నదే ఇప్పుడు ఇటు భక్తులను, అటు ఆధ్యాత్మిక వాదులను తొలిచి వేస్తున్న ప్రశ్న. ఎందుకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయంలో ఆ దేవ దేవునికి మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తుంటారు భక్తులు. పంచమకర తాంత్రిక ఆచారాల్లో భాగంగా స్వామి వారికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పస్తారు. ముఖ్యంగా మిగతా నాలుగు ఆచారాలైన మాంసం, మత్స్య, ముద్ర (గింజ), మైతున (శృంగారం) అనే వాటిని ప్రస్తుతం పాటించట్లేదు. కానీ మద్యం సమర్పణను మాత్రం కొనసాగిస్తున్నారు.
ఎక్కడైనా గుడి బయట పూలు, కొబ్బరికాయలు అమ్మే దుకాణాలు ఉండటం చూసే ఉంటారు. ఉజ్జయినిలో మద్యం అమ్మే దుకాణాలు ఉంటాయి. పూలు, కొబ్బరికాయలతో పాటు మద్యాన్ని కూడా బుట్టలో పెట్టి అమ్ముతుంటారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు ఇలా విక్రయిస్తుంటారని అనుకోవద్దు, ఏకంగా ప్రభుత్వమే కౌంటర్లు ఏర్పాటు చేసి కల్తీ లేని మద్యాన్ని విక్రయిస్తుంది ఇక్కడ.
అయితే తాజాగా సర్కారు మద్యపాన నిషేధం విధిస్తూ చేసిన ప్రకటనల జాబితాలో ఉజ్జయిని కూడా ఉంది. మరి ఈ నిషేధం వల్ల ఆ దేవ దేవుడికి మద్యాన్ని సమర్పించే ఈ ఆచారం ఆగిపోతుందా అనేది ఇప్పుడు అందరిని తొలచివేస్తోంది. దీనిపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పష్టతనిచ్చారు. ఎప్పటిలాగే కాలభైరవ స్వామికి మద్యం సమర్పించవచ్చని చెప్పారు సీఎం. ప్రసాదాన్ని ఆలయానికి తీసుకెళ్లవచ్చన్నవారు. ఉజ్జయినిలో మద్యం దుకాణాలను మూసివేస్తారు. కానీ ఆలయ పరిసరాల్లోని మద్యం కౌంటర్లు మాత్రం ఎప్పటిలాగే కొనసాగనున్నాయి. ఈ కౌంటర్లలోనే మద్యం కొనుగోలు చేసి కాలభైరవునికి సమర్పించవచ్చు.
గతంలో మద్య నిషేధం అమలు చేసినప్పుడు కూడా కాలభైరవ ఆలయంలో ఈ ఆచారాన్ని కొనసాగించినట్లు ఆలయ పూజారి ఓం ప్రకాష్ చతుర్వేది తెలిపారు. 2016లో సింహస్త పండగ సమయంలో మద్య నిషేధం ఉన్నప్పటికీ దేవుడిని మద్యం నైవేద్యంగా పెట్టినట్లు గుర్తు చేశారు. మద్యాన్ని ప్రసాదంలా కూడా భక్తులకు అందించామని అన్నారు.