ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్,,,ముంబయి దాడుల ఉగ్రవాది భారత్‌‌కు అప్పగింత

national |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 09:11 PM

పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్‌ రాణా.. 26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారుల్లో ఒకరు. ప్రస్తుతం లాస్‌ ఏంజెలెస్‌ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడ్ని అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్‌ కోరుతోంది. దీనిపై అమెరికా కోర్టులో వాజ్యాలు దాఖలు చేసింది. వీటిని సవాల్‌ చేస్తూ తహవూర్‌ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. అతడి అభ్యర్థనను ఆయా కోర్టులు తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌ రాణా అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబరు 13న అమెరికా సుప్రీంకోర్టు తలుపుతట్టాడు. అతడు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని ఇటీవల న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు అమెరికా ప్రభుత్వం డిసెంబరు 16న అఫిడవిట్‌ దాఖలు చేసింది.


దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు.. రాణా అభ్యర్థనను జనవరి 21న కొట్టివేసింది. దీంతో ముంబయి దాడుల సూత్రధారిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ లభించడంతో చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొద్ది నెలల్లో అతడ్ని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. యూఎస్ సొలిసిటర్ జనరల్ ఎలిజబెత్ బి ప్రెరోల్గర్ మాట్లాడుతూ.. ఈ కేసులో రాణాను భారతదేశానికి అప్పగించకుండా ఉపశమనం లభించదని అన్నారు. ‘‘ఈ కేసులో తమకు అప్పగించాలని భారత్ కోరుతున్న అంశాన్ని ప్రభుత్వ ప్రాసిక్యూషన్ కవర్ చేసింది’ అని తెలిపారు.


పాకిస్థాన్ ఉగ్రవాదులు 2008 నవంబరు 26న అరేబియా సముద్రం గుండా ముంబయిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వేస్టేషన్‌, విదేశీయులు ఎక్కువగా బసచేసే తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దాదాపు 60 గంటల పాటు సాగించిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు అమెరికా పౌరులు, 18 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు విదేశీయులు ఉన్నారు.


ఈ దాడులకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించగా... అతడికి రాణా సహకరించినట్లు ఆధారాలు లభించాయి. ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీతో పరిచయం ఉందని దర్యాప్తులో తేలింది. ముంబయి దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com