ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై మావోయిస్టు పార్టీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. బడే చొక్కారావు మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించడాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈ మేరకు సంచలన లేఖ విడుదల చేసింది. దామోదర్ మృతిచెందలేదని.. ఆయన క్షేమంగా ఉన్నారని.. సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ తేర్ సమత పేరుతో లేఖ విడుదల చేశారు. దామోదర్ తన సహచరులతో ఇటీవల ఫోలన్ ద్వారా మాట్లాడినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపారని వెల్లడించింది.
ఈ సందర్భంగా.. పోలీసులపై మావోయిస్టు పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. పోలీసులు కావాలనే బూటకపు లేఖలు తయారు చేసి.. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించింది. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 8 మంది మృతి చెందినట్లు లేఖలో మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. అందులో.. నలుగురు మావోయిస్టులని.. మిగతా నలుగురు గ్రామస్తులని పేర్కొంది. పోలీసులు అనవసరంగా గ్రామాల్లోకి చొరబడి.. అమాయక ప్రజలను బెదిరించడమే కాకుండా, దాడులకు పాల్పడుతూ బలి తీసుకుంటున్నారని మండిపడింది.
"ఆపరేషన్ కగార్" పేరిట కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు చేపట్టిన చర్యలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. జనవరి 16, 17 తేదీల్లో దాదాపు 8000 మంది భద్రతా బలగాలు చుట్టుపక్కల 4 గ్రామాలపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో.. అమాయక గ్రామస్థులను టార్గెట్ చేసి.. వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టాయని భద్రతా బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, భద్రతా బలగాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అనవసర అలజడులు సృష్టిస్తున్నాయని.. ఇది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. పోలీసుల ప్రకటనలన్నీ బూటకపు ప్రకటనలేనని.. నిజాలను దాచిపెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ మండిపడింది.
కాగా.. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు మాత్రం బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రకటించారు. ఈ మేరకు చాలా మీడియా సంస్థలు కూడా అలాగే వార్తా కథనాలు రాశాయి. దీంతో.. ఈ ప్రచారంపై మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేయగా.. మరి పోలీసులు చెప్పేది నిజామా.. మావోయిస్టు పార్టీ కావాలనే తప్పుదోవ పట్టిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.