వచ్చే బడ్జెట్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించి మినహాయింపులు పెంచాలని కోటి ఆశలు పెట్టుకున్నారు సామాన్యులు. ప్రస్తుతం ఆసుపత్రి ఖర్చులు ఏ స్థాయిలో ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. అయితే అలాంటి వైద్య ఖర్చుల నుంచి ఆరోగ్య బీమా ఊరట కల్పిస్తుంది. ప్రతి ఒక్క కుటుంబానికీ ఆరోగ్య రక్షణ అవసరం. కరోనా తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత తెలిసివచ్చింది. చాలా మంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అలాగే ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై ట్యాక్స్ మినహాయింపు ఇస్తోంది కేంద్రం. అయితే ఈ పరిమితి చాలా తక్కువగా ఉందని, దానిని పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ 2025పైనే కోటి ఆశలు పెట్టుకున్నారు సామాన్యులు.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులో ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 సంవత్సరాల లోపు ఉన్న ఓ వ్యక్తి తనతో పాటు భార్యాపిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ప్రీమియంపై గరిష్ఠంగా రూ.25 వేలు మినహాయింపు పొందవచ్చు. 60 సంవత్సరాలు దాటిన వారికి సెక్షన్ 80డీ ద్వారా రూ.50 వేల వరకు మినహాయింపులు లభిస్తాయి. ఒక వేళ తల్లిదండ్రుల పేరుపై ఆరోగ్య బీమా తీసుకున్నవారు అదనంగా మరో రూ.25 వేల వరకు క్లెయిమ్ చేయవచ్చు. తల్లిదండ్రుల వయసు 60 ఏళ్లు దాటితే రూ.50 వేలు మినహాయింపు పొందొచ్చు. అంటే గరిష్ఠంగా రూ. 1 లక్ష వరకు మినహాయింపులు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సెక్షన్ 80డీ పన్ను మినహాయింపులు చివరిసారిగా 2015 బడ్జెట్లో సవరించారు. రూ.15 వేలుగా ఉన్న మినహాయింపులను రూ.25 వేలకు పెంచారు. 60 ఏళ్లు దాటిన వారికి మాత్రం 2018లో సవరించారు. రూ.30 వేల మినహాయింపు నుంచి రూ.50 వేలకు పెంచారు. అప్పటి నుంచి ఈ మినహాయింపు పరిమితిని పెంచాలని ప్రతి బడ్జెట్ సమయంలో కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. ఈ బడ్జెట్ 2025లోనైనా పరిమితి పెంచుతారేమో చూడాలి.
దేశంలో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసింది. కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి తీవ్రంగా మారింది. ఆరోగ్య బీమా ప్రీమియం రేట్లు భారీగా పెరిగాయి. జీఎస్టీ రేట్లు సైతం ప్రీమియాన్ని పెంచుతున్నాయి. దీంతో ఇప్పుడు ఉన్న సెక్షన్ 80డీ పరిమితి ద్వారా తమ అవసరాలను తీర్చడం లేదని సామాన్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉన్న వారు ఈ పరిమితిని పెంచాలంటున్నారు. దేశంలో ఇప్పటికీ లక్షల మంది ఆరోగ్య బీమాకు దూరంగానే ఉన్నారు. వారందరూ బీమా పాలసీ తీసుకోవాలంటే మినహాయింపులు కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు.. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80డీని అందిస్తే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు