ఆంధ్రప్రదేశ్‌లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం 2025 పేరుతో భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించి జీవో నెంబర్ 30ని జారీ చేసింది. ఈ నిర్ణయానికి గత కేబినెట్‌లో ఆమోదం తెలపగా.. దానికి అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్ని క్రమబద్ధీకరిస్తారు. ఈ క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేర్లపైనే జారీచేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో అంశాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 2019 అక్టోబరు 15ను కటాఫ్ డేట్‌గా తీసుకుంది.. ఆ తేదీ కంటే ముందు ఆక్రమించినవారికే నిబంధనలు అనుసరించి భూముల్ని క్రమబద్ధీకరిస్తారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తారు.. కాకపోతే లబ్ధిదారుల కుటుంబసభ్యులు ఐటీ చెల్లింపుదారై ఉండకూడదు. నాలుగు చక్రాలు వాహనం ఉంటే అనర్హులు.. కాకపోతే వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు, టాక్సీ, ఆటోలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. క్రమబద్ధీకరణకు సంబంధించి.. లబ్ధిదారులకు పట్టా, కన్వేయన్స్ డీడ్ అందజేసిన రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. 150 గజాల నిర్మాణానికి జరిగే రిజిస్ట్రేషన్‌కు ఫీజు చెల్లించక్కర్లేదు. 151-300, 301-450, 451 గజాలకు పైన ఇంటి నిర్మాణాన్ని బట్టి.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు, ఎగువున ఉన్నవారి రిజిస్ట్రేషన్ బేసిక్ విలువలో, రిజిస్ట్రేషన్ ఫీజులో చెల్లించాల్సిన వివరాలను కూడా ప్రస్తావించారు. లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో నిర్దేశిత స్థలాలు, జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ చేయరు. అలాగే ఖాళీ స్థలాలు, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్నా క్రమబద్ధీకరణకు అనర్హులని ఉత్తర్వల్లో పేర్కొన్నారు.
'రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా గ్రామాల్లో నెలకు 10,000, పట్టణాల్లో నెలకు రూ.14,000 ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులు. నెలకు రూ.300లోగా విద్యుత్తు ఛార్జీల చెల్లింపు ఉండాలి. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించకూడదు. ఆర్‌సీసీ రూఫ్/ఆస్‌బెస్టాస్ రూఫ్‌ను ఇటుక గోడలతో నిర్మించి ఉండాలి. క్రమబద్ధీకరణకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చెల్లింపు, విద్యుత్తు బిల్లు, వాటర్ బిల్లులను పరిగణనలోకి తీసుకుంటారు'అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ఈ క్రమబద్దీకరణకు కొత్త దరఖాస్తులను డిసెంబరు 31వ తేదీ వరకు గ్రామ,వార్డు సచివాలయాల్లో తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. 'ఇప్పటికే స్వీకరించి, పెండింగులో ఉన్న దరఖాస్తులనూ పరిగణనలోనికి తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామ,వార్డు సిబ్బంది ఆక్రమణలు జరిగిన ప్రాంతాలు పరిశీస్తారు. అనంతరం అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను గ్రామ,వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఒకవేళ అభ్యంతరాలు స్వీకరించి తహసీల్దార్లు తుది జాబితాను సబ్‌కలెక్టర్, ఆర్‌డీఓకు పంపిస్తారు. ఒకవేళ సబ్ డివిజన్ లెవెల్ అప్రూవల్ కమిటీ ప్రకటించిన అర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్‌కు 30 రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చు. అక్కడ జాయింట్ కలెక్టర్‌దే తుది నిర్ణయం.. అర్హుల జాబితా ఖరారైన తర్వాత ఆ వివరాలను తహసీల్దార్లు ఆ ప్రాంత సబ్-రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి'అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరనుంది.. అలాగే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది.