అరసవల్లి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. కూటమి ప్రభుత్వం తొలిసారిగా ‘రథసప్తమి’ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా హెలీకాఫ్టర్ టూరిజం, లేజర్ షో నిర్వహించనున్నారు. బుల్లితెర ప్రముఖులతో ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి, నృత్యరూప ప్రదర్శనలకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాలకు లక్షలాది మంది తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 80 అడుగుల రోడ్డులో 6 గంటలకు సామూహిక సూర్యనమస్కారాలతో వేడుకలకు శ్రీకారం చుట్టారు.