ప్రపంచంలోని 127 దేశాల్లో ఆకలి సూచికలో భారతదేశం 106వ స్థానంలో ఉంది. కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి దేశంలో ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి వెల్లడించారు. ఆపార్టీ 27వ రాష్ట్ర మహాసభలు శనివారం నెల్లూరులో ప్రారంభమయ్యాయి. మూడు రోజలపాటు ఈ సభలు జరిగే అనిల్ గార్డెన్స్‌కు సీతారాం ఏచూరి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి మాట్లాడుతూ... ‘దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూసీచూడనుట్లు వ్యవహరిస్తోంది. ఆర్థికవేత్తలు ఎన్ని సూచనలు చేసినా కేంద్రం తగిన విధంగా స్పందించకపోవటంతో గిరిజనులు, వెనుకబడిన వర్గాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
గడిచిన ఎనిమిదేళ్లలో 1,00,474 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 24 గంటలకు 34 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకుంటుంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పూర్తిగా ముస్లింలు ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడానికి కారణం... కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లను ఓట్లు వేయకుండా భయపెట్టింది. మరికొన్ని చోట్ల భయపెట్టి ఓట్లు వేయించుకుంది. వామపక్ష నేతలు అధికారంలో ఉన్న దేశాల్లో ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి. ఆయా దేశాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.... ‘బీజేపీ, మతతత్వాన్ని రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెడుతోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఏపీకి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు ప్రకటించారు.అవి ఎక్కడ ఖర్చుచేసారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసారు.