వక్ఫ్ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్ధతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయి అని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. అయన మాట్లాడుతూ..... మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆ రెండు పార్టీలు వాడుకున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు ద్రోహం చేశారు. ఆయన నిజస్వరూపం బయటపడింది. 1995లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు, 2004లో ఓడిపోయిన తర్వాత `నా జీవితంలో చారిత్రాత్మక తప్పిదం చేశానని మైనారిటీలకు క్షమాపణలు చెప్పాడు. ముస్లిం వ్యతిరేక బీజేపీతో భవిష్యత్తులో కలిసేది లేదని బహిరంగ సభలో ప్రకటించారు. కానీ 2014లో అవసరం కొద్దీ అదే ముస్లిం వ్యతిరేక బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చి ఒక్క మైనారిటీకి కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు. రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ప్రాతినిథ్యం లేని ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర చంద్రబాబుది. మళ్లీ 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు మైనారిటీల ఓట్ల కోసం ఎన్ఎండీ ఫరూక్‌ను మంత్రిని చేసిన మోసగాడు చంద్రబాబు. 2019లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు, మళ్లీ అధికారం కోసం 2024లో బీజేపీతో జతకట్టాడు. ఇప్పుడు ముస్లింల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతిచ్చి మైనారిటీలకు వెన్నుపోటు పొడిచాడు. బిల్లును వ్యతిరేకించాలని ఎందరో ముస్లిం మత పెద్దలు చంద్రబాబుని కలిసినప్పుడు వారికి అండగా ఉంటానని, అన్యాయం జరగకుండా చూస్తానని నమ్మించాడు. ఆఖరుకి పవిత్ర రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇప్తార్ విందులోనూ మైనారిటీలకు అన్యాయం జరగనివ్వనని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తానని మోసపూరిత హామీ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందన్నట్టు నేషనల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించుకున్నాడు. తీరా చూస్తే ఆ పార్టీ ఎంపీలు బిల్లుకు మద్దతు పలికి మైనారిటీలను తీవ్రంగా వంచించారు. టీడీపీ సపోర్టుతో నడిచే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు తలచుకుంటే ఈ బిల్లు చట్టంగా మారే అవకాశమే ఉండేది కాదు. అయినా చంద్రబాబు ముస్లింల మనోభావాలను కాలరాసేలా తన ఎంపీలతో బిల్లుకు మద్దతు పలికారు అని తెలిపారు.
![]() |
![]() |