రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులే కాదు ఇపుడు ఏకంగా బైక్ లే వచ్చేస్తున్నాయి. వినియోగదారుల ముందుకు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఓబెన్ ఎలక్ట్రిక్.. ‘రోర్’పేరుతో బైక్ ను ఆవిష్కరించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999. కేవలం రూ.999 చెల్లించడం ద్వారా బైక్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ మినహాయింపులు, రుణ సదుపాయం, ఇన్సూరెన్స్ వివరాలను ఈ-అమృత్ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చని సూచించింది. నియో క్లాసికల్ డిజైన్ తో వచ్చిన రోర్ బైక్.. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది. పూర్తిగా డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 4.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 10 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన మోటార్ ను అమర్చారు. కేవలం మూడు సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది. మోటార్, బ్యాటరీ, కంట్రోలర్, డ్రైవ్ ట్రెయిన్, డిజైన్ కు సంబంధించి వినూత్నమైన ఫీచర్లు ఉన్నాయని, వీటి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని ఓబెన్ ఎలక్ట్రిక్ తెలిపింది. సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకునే సదుపాయం, బ్యాటరీ దొంగల పాలు కాకుండా రక్షించే వ్యవస్థ, ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల పరంగా మార్కెట్లో చాలా ఆప్షన్లు ఉన్నా, బైక్ ల విషయంలో వినియోగదారుల ముందు తక్కువ ఎంపికలే ఉన్నాయి. ఈ క్రమంలో స్పోర్టీ లుక్ తో, అత్యాధునిక ఫీచర్లతో రోర్ రావడం విశేషం.