by Suryaa Desk | Sat, Jan 18, 2025, 04:57 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదలైంది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత అందరి నోళ్లలో ఎక్కువగా నానిన పేరు 'బుల్లిరాజు'. ఈ సినిమాలో వెంకటేశ్ పదేళ్ల కొడుకు పాత్ర పేరు 'బుల్లిరాజు'. ఈ పాత్రను మాస్టర్ రేవంత్ పోషించాడు. ఫస్టాఫ్ అంతా కూడా ఈ పాత్రనే పడిపడి నవ్విస్తూ ఉంటుంది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ. "మాది భీమవరం దగ్గర 'గణపవరం'.నాకు ఇప్పుడు పదేళ్లు 5వ క్లాస్ చదువుతున్నాను. నాకు పవన్ కల్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఒక పొలిటికల్ వీడియోలో అనిల్ రావిపూడిగారు నన్ను చూసి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. 'మా నాన్నకు వచ్చిందే రెండు స్టెప్పులు అనే డైలాగ్ ను ఆడిషన్ లో చెప్పించారు.ఓకే చేశారు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఎక్కడికి వెళ్లినా 'బుల్లిరాజు' అని పిలుస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది" అని అన్నాడు. "తొలిరోజున షూటింగులో వెంకటేశ్ గారిని చూసి భయపడ్డాను.అలవాటు లేని వాతావరణం కావడం వలన కొత్తగా అనిపించింది. కానీ వెంకటేశ్ గారు, అనిల్ రావిపూడి గారు చాలా సరదాగా మాట్లాడుతూ, నాలోని భయం పోగొట్టారు. అప్పటి నుంచి సింగిల్ టేక్ లోనే చేశాను. వెంకటేశ్ గారు నన్ను భోజనానికి పిలిస్తే వెళ్లాను.చాలా బాగా చూసుకున్నారు. మహేశ్ బాబు గారు కబురు చేస్తే వెళ్లాను. నేను చాలా బాగా చేశానని మెచ్చుకున్నారు" అని చెప్పాడు.
Latest News