![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 05:14 PM
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎంపీ ఇంట్లోకి చొరబడ్డ నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం. నగరంలోని పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడు... ఏం ఎత్తుకెళ్లాడు.. ఇంట్లో చొరబడటానికి కారణం ఏంటి అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు (మంగళవారం) చోరీపై పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా... గత ఆదివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లోని డీకే అరుణ ఇంట్లోకి దుండగుడు ప్రవేశించడం తీవ్ర సంచలనం రేపింది. ఫేస్ కనిపించకుండా ముసుగు, గ్లౌజులు ధరించిన దుండుగుడు అర్ధరాత్రి సమయంలో ఎంపీ ఇంట్లోకి వెళ్లాడు. ఎంతో చాకచక్యంగా కిచెన్, హాలులోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఆఫ్ చేశాడు. దాదాపు గంటన్నర పాటు ఆ దొంగ ఇంట్లో కలయతిరిగాడు. దొంగ ఇంట్లోకి ప్రవేశించడంపై వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దొంగ వచ్చిన సమయంలో ఇంట్లో డీకే అరుణ లేరు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే డీకే అరుణ ఇంట్లో దుండగులు ఎలాంటి చోరీకి పాల్పడలేదని పోలీసులు చెప్పారు. మరి దుండగుడు ఎందుకు ఇంట్లోకి చొరబడ్డారనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.