![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:47 AM
అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తిలా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పుల పరిస్థితికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్ అయితే, రెండో ముద్దాయి కాంగ్రెస్ అన్నారు.లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై రాహుల్ గాంధీ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. పదిహేను నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1.63 లక్షల కోట్లు అప్పులు చేసిందని అన్నారు. అప్పులు చేయడంలో మాత్రమే తెలంగాణ రైజింగ్ కనిపిస్తోందని విమర్శించారు. గత బీఆర్ఎస్ చేసిన లక్షల కోట్ల విధ్వంసం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ దారిలోనే నడవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడవద్దని సూచించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కుటుంబ పార్టీలు మాత్రమే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసంపై కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వం 11 శాతానికి తెచ్చిన అప్పులను రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో లేదో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.