![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 06:00 PM
సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుండి తాడ్‌బండ్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీ ఫాం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీనికోసం బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద అండర్‌పాస్ నిర్మించనున్నారు. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవునా హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి వరకు రోడ్డు వంపులు తిరుగుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా అనుమతి ఇచ్చింది. దీంతో హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ కారిడార్ ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాలకు నగరానికి మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్, తాడ్‌బండ్, బోయినపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల గుండా వెళ్లాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ నేషనల్ హైవే వైపు వెళ్లే ప్రయాణికుల కష్టాలు తీరుతాయి. అందులో భాగంగా.. బోయినపల్లి చౌరస్తా నుంచి బలంరాయి రోడ్డును కలుపుతూ బేగంపేట ఎయిర్‌పోర్టు కింద నుంచి సొరంగ మార్గం నిర్మిస్తారు.
ప్రస్తుతం ఈ కారిడార్ కోసం హెచ్ఎండీఏ ప్రైవేటు ఆస్తులను సేకరిస్తోంది. కంటోన్మెంట్ ప్రాంతంలో డిఫెన్స్ ఆస్తులు ఇంకా హెచ్ఎండీఏ చేతికి రాలేదు. ఈ ఆస్తుల బదలాయింపు గురించి ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ ఆస్తులను హెచ్ఎండీఏకు అప్పగిస్తారు అని అధికారులు చెబుతున్నారు. ఆస్తులు పూర్తిగా హెచ్ఎండీఏ చేతికి వచ్చాక టెండర్లు పిలుస్తారు. ఆ తర్వాత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మొదలుపెడతారు. ఈ కారిడార్ మొత్తం పొడవు 5.32 కి.మీ. దీనికోసం దాదాపు రూ. 1580 కోట్లు ఖర్చు చేయనున్నారు. బేగంపేట వద్ద నిర్మించే అండర్‌పాస్ పొడవు 0.6 కి.మీ. ఈ అండర్ పాస్, ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.