![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:15 PM
ఉత్తరప్రదేశ్, అలహాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో ఫస్టియర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి శనివారం రాత్రి హాస్టల్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థి రాహుల్ మాదాల చైతన్యగా గుర్తించారు. 21వ పుట్టిన రోజు జరుపుకోవడానికి ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే, పరీక్షల్లో ఫెయిల్ కావడంతో నిరాశతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇనిస్టిట్యూట్ విచారణకు ఆదేశించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.పోలీసుల కథనం ప్రకారం రాహుల్ శనివారం రాత్రి 11.55 గంటలకు హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో రెండుమూడు రోజులుగా రాహుల్ తీవ్ర ఆవేదనలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కుమారుడి ఆత్మహత్య విషయం తెలుసుకున్న రాహుల్ తల్లిదండ్రులు నిన్న మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. శనివారం రాత్రి రాహుల్ నుంచి మెసేజ్ వచ్చిందని, తమ్ముడిని, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని అందులో రాశాడని రాహుల్ తల్లి స్వర్ణలత తెలిపారు. ఆ మెసేజ్ చూసిన వెంటనే భయంతో ఫోన్ చేశానని, కానీ ఫోన్ ఆఫ్‌లో ఉందని చెప్పారు. దీంతో అతడి స్నేహితుడికి ఫోన్ చేశానని, అతడు కనుక్కొని వస్తానని చెప్పి వెళ్లాడని, ఆ తర్వాత ఫోన్ కట్ చేశాడని చెప్పారు. పది నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి రాహుల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టు చెప్పాడని వివరించారు. ఆదివారం మధ్యాహ్నం క్యాంపస్‌కు చేరుకున్నాకే రాహుల్ ఆత్మహత్య గురించి తెలిసిందని స్వర్ణలత తెలిపారు. ఆరు నెలలుగా రాహుల్ క్లాసులకు హాజరు కావడం లేదని ఇనిస్టిట్యూట్ చెప్పిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ విషయాన్ని గతంలో ఎప్పుడూ యాజమాన్యం తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాహుల్ జేఈఈ మెయిన్స్‌లో ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీలో ఆలిండియా 52వర్యాంకు సాధించినట్టు తెలిపారు. రాహుల్ తండ్రి టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు.