![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 09:34 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్ టిక్కెట్లు, పాసుల కోసం హెచ్‌సీఏ వేధిస్తోందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు.ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ నుంచి బెదిరింపులు ఎదురువుతున్నాయని ఆరోపణలు వచ్చాయని, ఈ అంశంపై తీవ్ర ఆందోళన చెందినట్లు హెచ్‌సీఏ కోశాధికారికి సన్ రైజర్స్ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది.ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం కాంప్లిమెంటరీ టిక్కెట్లను కేటాయిస్తున్నామని, 50 సీట్ల సామర్థ్యం కలిగిన ఎఫ్ 12ఏ కార్పొరేట్ బాక్సు టిక్కెట్లు కూడా అందులో భాగమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు.అయితే ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమేనని, కాబట్టి అదనంగా 20 టిక్కెట్లు కేటాయించాలని అడిగారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని ఆదేశించారు.