![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 10:38 AM
వేసవిలో ఈసారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఏప్రిల్-జూన్ మధ్య ఈసారి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని వివరించింది. రాబోయే మూడు నెలలపాటు అనేక ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు ఎక్కువగా వడగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మామూలుగానైతే ఈ మూడు నెలల్లో నాలుగు నుంచి ఏడు రోజుల వరకు వడగాలులు నమోదవుతుంటాయి. ఈసారి ఇవి మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, యూపీ, హర్యానా, బీహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెలలో దేశంలోనే పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.ఇక, వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నేడు, రేపు, ఎల్లుండి చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, నిన్న ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 2.4 డిగ్రీలు అధికం.