|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 07:42 PM
ధరణి పోర్టల్ సాక్షిగా సాగు భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల మళ్లింపు వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భారీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న యాదగిరిగుట్టకు చెందిన బస్వరాజ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి రూ. కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది. జనగామ కేంద్రంగా బయటపడిన ఈ 'డిజిటల్ దోపిడీ' వెనుక ఆధునిక హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ బర్ప్ సూట్ వాడినట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు బస్వరాజ్.. కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జీల మళ్లింపు ద్వారానే ఏకంగా రూ. 11 కోట్లు వెనకేసినట్లు సమాచారం. ఈ అక్రమ సంపాదనతో అతను అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఖరీదైన ఫార్చ్యూనర్ కార్లు కొనడమే కాకుండా, పదేపదే థాయ్‌లాండ్ వంటి విదేశీ పర్యటనలు చేస్తూ ఎంజాయ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఇతనికి పాండు అనే మరో వ్యక్తి సహకరించినట్లు తెలుస్తోంది. బస్వరాజ్ వద్ద 1,200కు పైగా రిజిస్ట్రేషన్ పత్రాలు లభించడం ఈ దోపిడీ తీవ్రతను అద్దం పడుతోంది.
ఈ కుంభకోణంలో ‘బర్ప్ సూట్’ సాఫ్ట్‌వేర్‌ను నిందితులు అద్భుతంగా వాడుకున్నారు. సాధారణంగా రైతులు రిజిస్ట్రేషన్ ఛార్జీలను నగదు రూపంలో ఆన్‌లైన్ సేవా కేంద్రాల్లో చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక రైతు రూ. 15,000 ఛార్జీ ఇస్తే.. నిర్వాహకులు అందులో కేవలం రూ. 150 మాత్రమే బ్యాంకుకు చెల్లించేవారు. అయితే బర్ప్ సూట్ సాఫ్ట్‌వేర్ ద్వారా బ్యాంకింగ్ డేటాను ఇంటర్సెప్ట్ చేసి ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం రూ. 15 వేలు జమ అయినట్లు తప్పుడు రశీదులు సృష్టించేవారు. ఇలా ఒక్కో లావాదేవీలో వేల రూపాయలు దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,800 లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు, దీనివల్ల ప్రభుత్వానికి రూ. 52 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తేలింది. ముఖ్యంగా జనగామ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ అక్రమాలు తారస్థాయిలో జరిగాయి. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా బయటకు రాకుండా ఉండేందుకు నిందితులు వారికి భారీగా 'మామూళ్లు' ముట్టజెప్పినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ భారీ స్కామ్‌పై ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్ విభాగాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బస్వరాజ్ లాంటి నిందితులు పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను ఎలా వాడుకున్నారనే కోణంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది.