కొల్లేరు నుంచి ఉప్పుటేరు కలిసేచోట పూడిక పెరిగిపోతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. ప్రజలకు ఇబ్బందిలేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి సమాలోచనలు చేశారు. బుడమేరు, కృష్ణా నదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చించారు. ఈసందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఉప్పుటేరు పూడిక తీసే అంశంపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మొత్తం 5 అంశాలపై వారికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నెలాఖరులోపు దీనికి సంబంధించిన నివేదిక తయారుచేయనున్నారని తెలిపారు. వరదల సమయంలో సీఎం చంద్రబాబు సహా అంతా కష్టపడి పనిచేశారని వివరించారు. వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. వైకాపా సర్కారు చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని నిమ్మల రామానాయుడు చెప్పారు.