కనీవినీ ఎరుగని రీతిలో గత సెప్టెంబరులో విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకోవడం తెలిసిందే. బుడమేరకు గండ్లు పడడంతో విజయవాడను జలవిలయం బారినపడింది. ఈ నేపథ్యంలో, నేడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బుడమేరు వరద నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ, నాటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే బుడమేరు ముంపునకు కారణం అని విమర్శించారు. బుడమేరు వరద నియంత్రణపై సీఎంకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని, ఆ మేరకు అధికారులతో సమీక్షించామని తెలిపారు. బుడమేరు వరద వల్ల విజయవాడకు తీవ్ర నష్టం వాటిల్లిందని, విజయవాడ నగరాన్ని కాపాడుకోవడంపై ఓ అవగాహనకు వచ్చామని తెలిపారు. నీటిపారుదల, రెవెన్యూ, పురపాలక శాఖలు సంయుక్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని నిధులు సమీకరించాలని నిర్ణయించినట్టు వివరించారు. బుడమేరు పాత కాలువ సామర్థ్యం 3 వేల క్యూసెక్కులకు పెంచాల్సి ఉంటుందని, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించామని మంత్రి నిమ్మల వివరించారు. సమాంతరంగా కొత్త కాలువ తవ్వేందుకు కూడా అంచనాలకు ఆదేశించామని చెప్పారు. ఉప్పుటేరు మార్గాన్ని వెడల్పు చేయడం కూడా మరో కార్యాచరణ అని తెలిపారు. ఈ అంశాలన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 18న మరోసారి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించి, అనంతరం కేంద్రానికి పంపిస్తామని నిమ్మల వెల్లడించారు. సీఎం సూచనలకు అనుగుణంగా బుడమేరు కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని అన్నారు.