ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని టీడీపీ కూటమి సర్కారు చెప్తోంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఉచిత బస్సు పథకం సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లోని విధానాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. అందులో భాగంగానే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీయైన సంగతి తెలిసిందే. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం తీరును, విధానాన్ని ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
తాజాగా ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కర్ణాటకలో పర్యటిస్తోంది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. వీరంతా శుక్రవారం కర్ణాటకలో పర్యటించారు. బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్గం ఉపసంఘం సభ్యులు కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశమయ్యారు. కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యని కూడా ఏపీ మంత్రుల బృందం కలవనుంది.
మరోవైపు కర్ణాటకలో శక్తి పేరుతో ఉచిత బస్సు పథకం అమలవుతోంది. ఈ తరహాలోనే ఏపీలోనూ అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అయితే కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసి.. వాటి ద్వారా పథకం అమలు చేస్తున్నారు. మరి ఏపీలోనూ స్మార్ట్ కార్డులు తెస్తారా లేదా తెలంగాణ తరహాలో జీరో టికెట్ల విధానం అమలు చేస్తారా అనేది చూడాలి.
ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ పథకం అమలు చేస్తే.. ప్రతి నెలా ఏపీ ప్రభుత్వంపై రూ.265 కోట్ల వరకూ భారం పడుతుందని అంచనా.
రాాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 10 లక్షల మంది మహిళా ప్రయాణికులు బస్సు్ల్లో ప్రయాణిస్తుంటారని అంచనా. వీరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా 2 వేల బస్సులు సమకూర్చాల్సి ఉంటుంది. అలాగే 11 వేలకు పైగా ఆర్టీసీ సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే నెలకు రూ.265 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3182 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అంచనా.