రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు పండుగ మూడ్ నడుస్తోంది. సంక్రాంతి పండుగ ఉత్సాహంలోకి జనం వెళ్లిపోయారు. ఇక సినిమా ప్రేక్షకులు అయితే పెద్ద పండుగకు వచ్చే పెద్ద సినిమాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతి పండగకు బాలకృష్ణ డాకు మహరాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతుున్నాయి. అయితే బరిలో మూడు సినిమాలు ఉన్నప్పటికీ రాజకీయ రచ్చకు కారణమవుతున్న సినిమా మాత్రం గేమ్ ఛేంజర్ మాత్రమే..
గేమ్ ఛేంజర్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య ఇప్పుడు మాటల మంటలకు కారణమవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం రాత్రి ఈ వేడుక జరగ్గా.. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన మణికంఠ, చరణ్ అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో చనిపోయిన ఇద్దరు యువకులకు నిర్మాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో యువకులు చనిపోవడం బాధాకరమన్న పవన్ కళ్యాణ్.. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. జనసేన పార్టీ తరుఫున వారి కుటుంబాలకు ఐదు లక్షలు చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో గత వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని.. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పాడైపోయిన ఈ రోడ్డును ప్రస్తుతం బాగుచేస్తున్నామన్నారు. అయితే ఈ దశలో ఏడీబీ రోడ్డుపై ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యానంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
కాకినాడ - రాజమహేంద్రవరం మధ్య ప్రయాణానికి ఏడీబీ రోడ్డు కీలకమైనదని.. గత వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణం పనులను పట్టించుకోలేదని.. నిర్వహణ పనులు చేపట్టలేదని పవన్ విమర్శించారు. కనీసం విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఫలితంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని.. ఈ దశలో ప్రమాదం బాధాకరమని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే ఇక నుంచి పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగిస్తానని పవన్ కళ్యాణ్ ట్వీ్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా కౌంటర్ ఇచ్చారు. మానవత్వం మరిచి నిందలేస్తారా అని ప్రశ్నించారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లిన ఇద్దరు అభిమానులు చనిపోవటం బాధాకరమన్న రోజా.. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి మూడురోజులైనా పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించకపోవటం అమానవీయం అన్నారు. తెలంగాణలో పుష్ప టీమ్ మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 3 రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమంటూ రోజా ట్వీట్ చేశారు.
" ఆ యువకుల తల్లులు, కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా..? పరామర్శించకపోగా వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెయ్యకపోవడం కారణం అంటూ చౌక బారు రాజకీయం చెయ్యడం తగునా? పవన్ కళ్యాణ్ గారు. 7 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీ ప్రభుత్వ మే కదా? 7 నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నది మీరు కాదా? పవన్ కళ్యాణ్.. రోడ్డు వల్ల చనిపోతే వీరిద్దరి మరణానికి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కాదా..? మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోండి!!" అంటూ రోజా ట్వీట్ చేశారు.
మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపై స్పందించారు. పుష్ప సినిమాకు ఏమో నీతులు, గేమ్ ఛేంజర్‌కు పాటించరా అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ వ్వవహారం కాస్తా ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరి జనసేన శ్రేణులు దీనికి ఎలా కౌంటరిస్తాయనేదీ చూడాలి మరి.