జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సమయంలో కోర్టుకు అనుకోని అతిథి హాజరైంది. వారణాసి జిల్లా కోర్టులో వాదనలు జరుగుతుండగా.. హఠాత్తుగా ఓ వానరం హాలులో లోపలికి ప్రవేశించింది. దాదాపు గంట పాటు అక్కడే కూర్చుని ఆసక్తిగా వాదనలు గమనించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోర్టు విచారణకు కోతి రావడం శుభసూచికమని, సాక్షాత్తు ఆ దేవుడే వచ్చాడని హిందూ పక్షాలు అంటున్నాయి. ఇది తమ కేసుకు చాలా శుభపరిణామంగా వారు భావిస్తున్నారు. మత విశ్వాసాలు, సంప్రదాయాలకు దీనిని అన్వయిస్తున్నారు. నెట్టింటి తెగ చర్చ జరుగుతోంది.
జ్ఞానవాపి కేసుకు మతపరంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి కేసు విచారణ సందర్భంగా కోర్టు హాలులోకి అనుకోని విధంగా కోతి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. విస్తృత చర్చనీయాంశంగా మారింది. ఇది దైవ సంకేతమా? లేదా కేవలం యాదృచ్చికమా అనేది పక్కనబెడితే.. నిస్సందేహంగా ఈ సంఘటన జ్ఞానవాపి కేసు విచారణకు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఇక, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయానికి పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదుపై వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. లార్డ్ విశేశ్వర Vs అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ కేసు విచారణ 1991 నుంచి కొనసాగుతోంది. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు, ఆలయాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ పక్షం కోరుతోంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని సీలువేసి నేలమాళిగలో పూజలకు గతేడాది జనవరిలో వారణాసి కోర్టు అనుమతించింది. మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ సర్వే వెల్లడించింది. అయితే, అదనంగా మరోసారి ఏఎస్ఐతో సర్వే చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పక్షాలు చేసిన విజ్ఞస్తిని వారణాసి కోర్టు గతేడాది అక్టోబరులో తిరస్కరించింది. దీంతో వారు హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.
కాగా, అయోధ్య రామజన్మభూమి ఉద్యమం ఉద్ధృతంగా ఉన్నప్పుడు నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991లో 'ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టాన్ని' తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 1947 అగస్టు 15నాటికి దేశంలోని ప్రార్థనా స్థలాల యథాతథ స్థితిని నసాగించాల్సి ఉంటుంది. ఇటీవల సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది.