కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీతో మెగాస్టార్ చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు కూడా చిరంజీవి వెళ్లారు. ఆ వేడుకలో ప్రధాని మోదీ పక్కనే చిరంజీవి ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ... బీజేపీ పెద్దలు, చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అంతకు మించి తనకు ఏమీ తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం వల్ల కూటమి ఏడు నెలల పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. ఏపీ పారిశ్రామికవేత్తలు ఏపీలో ట్యాక్సులు కడుతున్నారని... వాటిలో మనకు రావాల్సిన వాటా రావడం లేదని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలని చెప్పారు. ఏపీ సమైక్య రాష్ట్రంగా ఉండాలని పోరాటం మొదలు పెట్టింది తానేనని తెలిపారు. తెలంగాణ విభజనకు అప్పటి సీఎం రోశయ్య మద్దతు తెలపలేదని చెప్పారు. ట్యాంక్ బండ్ పై విగ్రహాలు పగలగొట్టేందుకు ఆందోళనకారులు వచ్చినప్పుడు... కృష్ణదేవరాయల విగ్రహం పగలగొట్టే ముందు తమపై దాడి చేయాలని కోరానని... దీంతో వాళ్లు తమను గౌరవించి వెనక్కి వెళ్లారని తెలిపారు. విభజన హామీల అమలు దిశగా రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టాలని... విభజన హామీల అమలుకు తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని చెప్పారు.