ధుమపానానికి బానిసైన వృద్ధుడు చివరకు సిగరెట్ మంటలకే ఆహుతయ్యాడు. ఈ ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని ద్రోణాదుల వారి వీధికి చెందిన చల్లా వెంకటేశ్వరరావు(71)కు ధూమపానం అలవాటుంది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యాడు. బుధవారం ఉదయం సిగరెట్ వెలిగించి నిద్రలోకి జారుకున్నాడు. టిఫిన్ నిమిత్తం వెంకటేశ్వరరావు భార్య బయటకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి భర్త మంటల్లో చిక్కుకుని ఉండటాన్ని గమనించింది. అప్పటికే తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వరరావును స్థానికుల సహాయంతో ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించాలని వైద్యులు సూచించగా, అప్పటికే వెంకటేశ్వరరావు మృతి చెందాడు. వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ సీఐ సీహెచ్ నాగప్రసాద్ తెలిపారు.