నంద్యాల పరిధిలోని బనగానపల్లెలో షాదీఖానాను పునః నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కోటి రూపాయలు, తాను సొంతంగా రూ.30 లక్షలు నిధులతో షాదీఖానా నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొంతవరకు పనులు జరిగాయని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం షాదీఖానా నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్లక్ష్యం వల్ల షాదీఖానా పూర్తికాలేదని చెప్పారు. ప్రజాధనం భారీగా వృథా అయ్యిందన్నారు. వీలైనంత త్వరగా షాదీఖానా నిర్మాణం పూర్తి చేసి ముస్లిం మైనార్టీలకు అంకితం చేస్తామని తెలిపారు. ఒక ఎకరా 17 సెంట్ల వక్ఫ్ బోర్డు భూమి అన్యాక్రాంతం అయిందన్నారు. పాత బంగ్లా వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.