ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ (AP cabinet) సమావేశం ప్రారంభమైంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాల కేటాయింపుపై ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 113 నియోజకవర్గాల్లో 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు గతంలోనే ఆమోదం లభించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వృద్ధి రేటు పెంపుపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. అందరికీ ఇళ్ల పథకం విధివిధానాల జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అలాగే సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై చర్చించే అవకాశముంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల ప్రత్యేకించి కేటాయించడంపై చర్చలు జరిపి.. కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపైనా మంత్రులతో విడిగా చర్చించే అవకాశముంది. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది.