ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ నారా లోకేష్ జనవరి 20నుంచి 24వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు.ఈ మేరకు ఆయన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా విద్యారంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. అయిదురోజులపాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికరంగ పెద్దలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఏపీ పెవిలియన్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన 30మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు.నెక్ట్స్ జెన్ ఎఐ, డాటా ఫ్యాక్టరీ, ఎఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ విడియా ప్రతినిధులు, ఎఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో లోకేష్ పాల్గొంటారు. ఇంటిలిజెన్స్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం, అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం, జెండర్ పారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు ఆయన హాజరవుతారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న మంత్రి లోకేష్ వైపు పారిశ్రామికవర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
భారత్ - డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతోపాటు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిధిగా హాజరవుతారు. సిఎన్ బిసి - టివి 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు నారా లోకేష్ హాజరవుతారు. గ్లోబల్ ఎకనామీ స్థితిగతులు – లేబర్ మార్కెట్ పై ఎఐ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రభావం అనే అంశంపై వైట్ షీల్డ్ తో, భవిష్యత్తుపై వాతావరణ ఉద్యమ ప్రభావంపై అంశంపై స్వనీతి ఇనిషియేటివ్ ప్రతినిధులతో, వార్షిక లీడర్ ఫోరమ్ పునరుద్దరణపై నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు.